రథసప్తమి

రథసప్తమి గురించి తెలుసుకుందాం

1. తిథి

మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమే రథసప్తమి. ఈ తిథి సూర్యదేవునికి సంబంధించినది. ఈ రోజు సూర్యోపాసన చేయడం వలన ఉపాసకులు సూర్యుని తేజతత్వ తరంగాలను అధికం గ్రహించగలరు. ఈ తరంగాల వలన ఉపాసకులకు బలం ప్రాప్తిస్తుంది.

2. రథసప్తమి వ్రతమును ఆచరించే విధి

2 అ

రథసప్తమి వ్రతము ఆచరించుటకు షష్ఠి రోజు ఉపవాసం ఉంటారు. సప్తమినాడు అన్ని విధులను పాటిస్తూ సూర్యోదయం కన్నా 1 గంట 36 నిమిషముల ముందు తెల్లనువ్వులు కలిపిన జలముతో స్నానం చేస్తారు. అలాగే వ్యాధినివారణ మరియు ఆరోగ్యప్రాప్తి కొరకు వ్రతము ఆచరించుటకు సంకల్పం చేస్తారు.

2 ఆ

ఇంటి ముందు వాకిలిని శుభ్రం పరిచి వీలైతే నేలను ఆవుపేడతో అలికి, ముగ్గులు వేసి అలంకరించాలి. రక్తచందనమును అరగదీసిన తర్వాత వచ్చిన లేపనంతో పీటపై ఏడు అశ్వములు ఉన్న రథములో విరాజిల్లే సూర్యభగవానుడి చిత్రమును వెయ్యాలి. ఈ పీటను ముగ్గులతో అలంకరించిన చోట పెట్టి షోడశోపచార పూజ చేస్తారు. రక్తచందనము, అక్షింతలు, ఎర్ర పువ్వులు, గరిక వేసిన జలముతో ‘ మిత్రాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి’, ‘రవయే నమః ఇదమర్ఘ్యం సమర్పయామి” అంటూ 12 నామాలను ఉచ్ఛరించి ప్రతి ఒక్క నామముతో అర్ఘ్యమును సమర్పించాలి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించమని సూర్యభగవానుడికి ప్రార్థన చెయ్యాలి. చేటలో 7 రకములు ధాన్యాలు పోసి ఎర్ర రవికతో సహా దానము లేక దక్షిణ ఇస్తారు.
ఆ తర్వాత ‘అకాల మృత్యు హరణం….’ అనే మంత్రాన్ని పఠించి, తీర్థము పుచ్చుకుంటారు.

అర్థము : అకాలములో వచ్చే మత్యువు మరియు అన్ని రోగములను నశింపచేసే సూర్య భగవానుడి చరణాల తీర్థమును నేను ప్రాశన చేస్తాను అని అర్థము.

2 ఇ

సూర్య స్తోత్రమును పఠిస్తారు. సూర్య భగవానుడి కథ చదువుతారు. పూజ తర్వాత మట్టి కుండలకు పూజ చేస్తారు. పిడకలు కాల్చి అగ్నిని ప్రజ్వలింప చేస్తారు. పిడకలులభ్యము కాకపోతే, శుభ్రపరిచిన అగ్నిష్టకుపూజ చేసి, అందులో బొగ్గులు కాల్చి అగ్ని ని ప్రజ్వలింప చేస్తారు. ఆ అగ్నిపై పూజ చేయబడిన మట్టి కుండలలో పాలు కాచి సూర్య భగవానుడికి అర్పిస్తారు.

2ఈ

ఈ వ్రతమును ముగించేందుకు రెండవ రోజు వీలైతే, బ్రాహ్మణునికి భోజనం పెడతారు, లేక వంట వండుకోవడానికి కావలసిన సరుకులు ఇస్తారు. అలాగే ఉపవాసాన్ని విరమిస్తారు.

సందర్భము : సనాతన గ్రంథము ‘పండుగల పద్ధతి మరియు వాటి అధ్యాత్మశాస్త్రము’ (హిందీ)