అక్షయ తృతీయ ఎప్పుడు జరుపుకుంటారు?

అక్షయ తృతీయ పండుగను వైశాఖ శుక్ల పక్ష తృతీయ తిథిన జరుపుతారు. అక్షయ తృతీయను ఉత్తర భారతదేశంలో ‘ఆఖ తీజ్’ అని కూడా అంటారు. అక్షయ తృతీయ తిథి మూడున్నర ముహూర్తాలలో ఒక సంపూర్ణ ముహూర్తంగా పరిగణించబడుతుంది. ఈ రోజు సత్యయుగం ముగిసి త్రేతాయుగం ప్రారంభమైందని నమ్ముతారు. అందువల్ల ఇది ఒక సంధికాలంగా పరిగణించబడుతుంది. సాధారణంగా ముహూర్తం కొన్ని క్షణాలపాటే ఉంటుంది; కానీ అక్షయ తృతీయ సంధికాలం కావడం వల్ల దీని ప్రభావం 24 గంటలు ఉంటుంది. అందుకే ఈ రోజు మొత్తం మంచి కార్యాల కోసం శుభదినంగా భావించబడుతుంది.

అక్షయ తృతీయ రోజున దానం చేయుటకు ఉన్న ప్రాముఖ్యత

పురాణకాలం నాటి ‘మదనరత్న’ అనే సంస్కృత గ్రంథంలో చెప్పిన ప్రకారం, భగవాన్ శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. వారు ఇలా అంటారు:

“అస్యాం తిథౌ క్షయముపైతి హుతం న దత్తం
తేనాక్షయేతి కథితా మునిభిస్తృతీయా ।
ఉద్దిశ్య దైవతపితౄన్ క్రియతే మనుష్యైః
తచ్చాక్షయం భవతి భారత సర్వమేవ ।। – మదనరత్న”

అంటే, ఈ తిథిన చేసిన దానం మరియు చేసిన హవన ఫలితం ఎప్పటికీ నశించదు. అందుకే మునులు దీన్ని ‘అక్షయ తృతీయ’ అని అన్నారు. దేవతలు మరియు పితృదేవతల కోసం ఈ తిథిన చేసే అన్ని కార్యాలు అక్షయములు అవుతాయి.

ఈ రోజున పితృదేవతల కోసం ఆమాన్నం (స్వయంపాకానికి సంబంధించిన సరుకులు), ఉదకకుంభం (నీటితో నిండిన కలశం), వట్టివేర్లతో చేసిన విసినికర్ర, గొడుగు, పాదరక్షలు (చెప్పులు) మొదలైన వస్తువులను దానం చేయాలని పురాణాలలో చెప్పబడింది.

సత్పాత్రునికి మాత్రమే ఎందుకు దానం చేయాలి?

అక్షయ తృతీయ రోజున చేసిన దానం వలన వ్యక్తికి పుణ్యఫలం లభిస్తుంది. పుణ్యం వల్ల స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. అయితే స్వర్గంలో సుఖాలను అనుభవించిన తర్వాత మళ్ళీ భూమిపై జన్మించవలసి వస్తుంది. మానవుడి అంతిమ లక్ష్యం స్వర్గ ప్రాప్తి మాత్రమే కాదు, పాప–పుణ్యాలకు అతీతంగా భగవత్‌ ప్రాప్తి పొందాలి. అందువల్ల సత్పాత్రునికి దానం చేయాలి. సత్పాత్రుడు అయినా వ్యక్తికి దానం చేయడం వలన ఆ కర్మ ‘అకర్మ కర్మ’గా మారుతుంది (అంటే పాప–పుణ్యాల నియమం వర్తించదు). ఇలా చేయడం వల్ల మానవుడి ఆధ్యాత్మిక ప్రగతి జరుగుతుంది. ఇలాంటి దానం వలన మనిషి స్వర్గ లోకానికి కాకుండా ఇంకా ఉన్నత లోకాలకు చేరుతాడు.

అక్షయ తృతీయ రోజు సత్పాత్రునికి దానం చేయండి!

ఈ రోజు చేసిన దానం ఎప్పటికీ నశించదు. సాధుసంతులు, ధర్మ కార్యం చేసేవారు, సమాజంలో ఆధ్యాత్మిక ప్రచారం చేసే సంస్థలు, దేశ భక్తి మరియు ధర్మజాగృతిని కలిగించే వ్యక్తులు లేదా సంస్థలకు దానం చేయడం, ఈ కాలానికి అనుగుణంగా ఇదే సత్పాత్రదానం.

సనాతన సంస్థ చేసే ఆధ్యాత్మిక ప్రచార కార్యం కొరకు దానం ఇవ్వడానికి..

 

అక్షయ తృతీయ ప్రాముఖ్యత:

1. అక్షయ తృతీయ రోజున హయగ్రీవ అవతారం, పరశురామ అవతారం మరియు నరనారాయణ అవతారం ఆవిర్భవించాయి.

2. అక్షయ తృతీయ రోజున బ్రహ్మ మరియు విష్ణువు, ఈ ఇద్దరు దేవుళ్ళ సంయుక్త తత్వం భూమిపైకి వస్తుంది. దీంతో భూమిపై సాత్వికత 10% పెరుగుతుంది. ఈ కాలమహిమ వలన ఈ తిథి నాడు పవిత్ర నదులలో స్నానాలు, దానాలు మరియు ధార్మిక క్రతువులు చేయడం చేత అత్యధిక ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరుతుంది.

3. ఈ తిథిన దేవుళ్ళు మరియు పితృదేవతలను ఉద్దేశించి చేసే అన్ని కర్మలు అక్షయములు అవుతాయి. (ఆధారం : మదనరత్న)

4. ఈ రోజు అంతా శుభ ముహూర్తమే. అందువల్ల పంచాంగం చూడకుండానే వివాహం, గృహప్రవేశం, వస్త్రాభరణాలు, భూమి మరియు వాహనాల కొనుగోలు చేయవచ్చు. నూతన వస్త్రాభరణాలు ధరించుటకు, కొత్తగా సంస్థలు వంటివి ప్రారంభించడం వంటి కార్యములకు ఈ రోజు శ్రేష్ఠమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు గంగ స్నానం మరియు భగవత్ పూజ వంటివి చేయుట వలన సమస్త పాపములు నశించిపోతాయి.

5. అక్షయ తృతీయ సంధి కాలంగా పరిగణించబడుతుంది. సంధికాలంలో చేసిన సాధన అనేక రెట్లు ఫలితాన్నిస్తుంది. ప్రతి రోజు ప్రాతః కాలం, సంధ్యా కాలం, పౌర్ణమి, అమావాస్యలు, సూర్య, చంద్ర గ్రహణాలు మరియు కుంభ పర్వము మొదలగు సంధికాలములలో సాధన చేయుటకు ప్రాముఖ్యతను తెలియచేసారు. అదే విధంగా హిందూ ధర్మశాస్త్రములలో ఒక యుగము అంతం మరియు మరొక యుగము ప్రారంభం అయ్యే రోజు సంధికాలం అగుట చేత అది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

6. ఈ తిథి వసంత ఋతువు ముగింపు, గ్రీష్మ ఋతువు ప్రారంభం అయ్యే రోజు కూడా.

Leave a Comment