హనుమంతుడు

హనుమంతుడు
హనుమంతుడు (వీరమారుతి)

హనుమాన్ జయంతి రోజున మిగితా రోజులకు పోలిస్తే వాతావరణంలో 1000 రెట్లు ఎక్కువ హనుమంతుని తత్త్వం  కార్యనిరతమై ఉంటుంది. హనుమంతుని ఉపాసకులకు ఈ తత్త్వం యొక్క ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో హనుమంతుని వేరు వేరు రూపాలు దాని శాస్త్రము మరియు హనుమంతుని ఉపాసనా శాస్త్రము గురించి ఇక్కడ పొందుపరచడమైనది.

 

1. రూపము

ఆకారము మరియు ముఖముల కనుసారముగ సాధారణంగా హనుమంతుని మూర్తులు క్రింది ప్రకారముగా కనిపిస్తాయి.

అ. ప్రతాప మారుతి

ప్రతాప మారుతి రూపము దివ్యంగా ఉంటుంది. ఒక చేతిలో సంజీవిని పర్వతము మరొక చేతిలో గదతో ఈ రూపములో దర్శనమిస్తారు.

ఆ. దాసమారుతి

దాసమారుతి శ్రీరాముని ఎదుట చేతులు జోడించి నిలబడి ఉంటాడు. అతని తల కొంచెము వంచి పాదాలు రెండూ కలిసి ఉంటాయి. ఈ రూపములో తోక గోళాకరంలో భూమిని తాకి ఉంటుంది.

ఇ. వీరమారుతి

వీరమారుతి యుద్ధమునకు సిద్ధముగా ఉన్న భంగిమలో ఉంటాడు. వీరమారుతి మూర్తి వీరాసన ములో ఉంటుంది. ఈ మూర్తి ఎడమ చేతిలో గద ఉంటుంది. ఎడమ చెయ్యి ముందుండి ఎడమకాలి తొడను ఆధారము చేసుకొని గదను ఎడమ భుజముపైన ఉంచి ఉంటుంది. కుడికాలి మోకాలును మడచి ఉంచి కుడి చెయ్యి అభయ హస్త ముద్రలో ఉంటుంది. వీరమారుతి తోక కుడి భుజము వెనుక నిలిచివుంటుంది. ఒక్కొక్కసారి అతని కాళ్ల క్రింద రాక్షసుల విగ్రహము కూడా ఉంటుంది. భూతము, చేతబడి మొదలగు వాటి వలన కలిగే బాధలు దూరమగుటకు వీరమారుతి ఉపాసన చేస్తారు.

వీరమారుతి నుండి శక్తి ప్రక్షేపితమైతే, దాసమారుతి రామునితో ఏకరూపమైనందున అతని నుండి భావము మరియు చైతన్యము ప్రక్షేపితమౌతాయి.

ఈ. పంచముఖి మారుతి

 

పంచముఖి మారుతి మూర్తులు ఎక్కువగా కనబడుచుంటాయి. గరుడ, వరాహ, హయగ్రీవ, సింహ, మరియు కపి ఈ ఐదు ముఖములు ఉంటాయి. ఈ దశభుజములు కలిగిన మూర్తి చేతులలో ధ్వజము, ఖడ్గము, పాశము మొ॥ ఆయుధములు ఉంటాయి. పంచముఖికి ఒక అర్థము-తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మరియు ఊర్ధ్వ ఈ ఐదు దిక్కులపై ఈ దేవుని గమనమున్నదని, మరియు వాటిపై అధికారమున్నది.

ఉ. దక్షిణముఖి (కుడివైపు చూస్తున్న) మారుతి

దక్షిణ శబ్దమునకు రెండు అర్థములున్నవి. ఒకటి దక్షిణ దిక్కు మరొకటి కుడివైపు.

దక్షిణ దిక్కుకు అర్థము : ఈ మూర్తి ముఖము దక్షిణము వైపుకు చేసి ఉంటుంది, అందువలన దీనిని దక్షిణముఖి మారుతి అంటారు.

కుడివైపుకు అర్థము : ఈ మూర్తి ముఖము కుడివైపుకు చేసి ఉంటుంది. ఈ మారుతిలో సూర్యనాడి కార్యనిరతమై ఉంటుంది. సూర్యనాడి తేజస్వి మరియు శక్తికలిగినదై ఉంటుంది. (గణపతి మరియు మారుతి వీరి సుషూమ్నానాడి ఎల్లప్పుడు కార్యనిరతమై ఉంటుంది; అయితే రూపము మారి నప్పుడు కొద్ది ప్రమాణములో మార్పుచెంది వారి సూర్య లేక చంద్రనాడులు కొద్ది ప్రమాణములో కార్యనిరత మౌతాయి.) కుడివైపు చూస్తుండే మారుతి కూడా కుడివైపు తొండమున్న గణపతి వలె ఉగ్రముగా ఉంటాడు. చెడుశక్తుల నివారణ కొరకు ఈ మూర్తి ఉపాసనను చేస్తారు. మహారాష్ర్టలో ముంబై, పూణె, ఔరంగాబాద్ మొదలైన స్థలములలోను మరియు కర్ణాటకలో బసవగుడి క్షేత్రములో ఇలాంటి మూర్తులు ఉన్నవి.

ఊ. వామముఖి (ఎడమవైపు చూస్తున్న) మారుతి

వామ అంటే ఎడమ ప్రక్క లేక ఉత్తరదిక్కు.

ఉత్తరదిక్కుకు అర్థము : ఈ మూర్తి ముఖము ఉత్తర దిక్కువైపు ఉంటుంది.

ఎడమ వైపుకు అర్థము : ఈ మారుతి ముఖము అతని ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది.

వామముఖి మారుతికి చంద్రనాడి కార్యనిరతమై ఉంటుంది. చంద్రనాడి శీతలము మరియు ఆనంద దాయకముగా ఉంటుంది. అలాగే ఉత్తర దిక్కు అధ్యాత్మ మునకు అనుకూలమైనది.

 

2. ఉపాసన

2 అ. ఉద్దేశ్యము

మారుతిలో ప్రకటశక్తి (72%) ఇతర దేవతలలో ప్రకటశక్తి (10%) తో పోలిస్తే చాలా అధిక ప్రమాణములో ఉండుటవలన శక్తుల సందర్బములో క్రింది కారణాలవలన మారుతి ఉపాసనను చేస్తారు.

2 అ 1. దుష్టశక్తుల ఇబ్బందుల నివారణ కొరకు ఉపాసన

‘సమాజములోని చాలా మందికి దుష్టశక్తుల ఇబ్బందులుంటాయి. కొన్నిసార్లు దుష్టశక్తుల చేత వ్యక్తికి శారీరక లేక మానసిక ఇబ్బందులు కలుగును, అలాగే వాని జీవనంలో ఎల్లప్పుడూ ఏదోఒక కష్టాలు సంభవిస్తుంటాయి. దుష్టశక్తులు సాధకుల సాధనలో కూడా ఆటంకాలను సృష్టిస్తాయి; దురదృష్టవశాత్తు చాలామందికి దుష్టశక్తుల ఇబ్బందుల గురించి తెలిసియుండదు. సమాజములోని చాలామంది భూతబాధ, చేతబడి మొదలగు దుష్టశక్తుల ఇబ్బందుల నివారణ కొరకు మాంత్రికులు లేక తాంత్రికుల దగ్గరకు వెళ్ళతారు; కాని వారు చేసిన ఉపాయాలు చాలావరకు తాత్కాలికంగా పనిచేస్తాయి, కావున దుష్టశక్తులు ఆ వ్యక్తికి మళ్ళీ ఇబ్బందులను కలిగించవచ్చును. చాలావరకు మాంత్రికులు మరియు తాంత్రికులు మోసగాళ్లై ఉంటారు. వారు ప్రజలను దోచుకుంటారు. కావున దుష్టశక్తుల ఇబ్బందుల నుండి నివారణ కొరకు మాంత్రికులు మొదలైన వారి చేతుల్లో చిక్కుకొనుటకంటే, అంతులేని కర్మకాండను చేయుట కంటే, సాధనను చేయుట సర్వోత్తమమైన ఉపాయము.

దుష్టశక్తులను నివారణచేయు దేవతలలో హనుమ ఒకడు. మారుతి నామజపము చేయుటచేత దుష్టశక్తుల ఇబ్బందుల నుండి శాశ్వతంగా విముక్తి ఎలా పొందాలో సనాతన సంస్థ సత్సంగాలలో నేర్పించబడును.

2 అ 2. రోగనివారణ

అనారోగ్యముతో ఉన్నవారు ఆరోగ్య వంతులయ్యేందుకు వారిని హనుమంతుని దేవస్థానమునకు తీసుకువెళ్ళే పద్ధతి ఉన్నది. రోగముల నుండి విముక్తి పొందుటకు వీరహనుమంతుని మంత్రమును ఉపయోగిస్తారు.

2 అ 3. మంచి శక్తిపైన నియంత్రణ

జాగృత కుండలిని మార్గములో అడ్డంకులు వస్తే, వాటిని దూరము చేసి కుండలి నికి యోగ్యదిశ చూపుటకు మారుతి ఉపాసనను చేస్తారు.

2 అ 4. పుత్రప్రాప్తి

స్త్రీలు పుత్రప్రాప్తి కొరకు మారుతి ఉపాసనను చేస్తారు. పుత్రులు లేని స్త్రీలు సింధూరముతో గోడ పై మారుతి చిత్రమును చిత్రించి ప్రతిదినము మారుతి పూజ చేస్తారు. అతని ముందర ఆరోహణ పద్ధతిలో ప్రమిధలను వెలిగిస్తారు. శనివారం నాడు మారుతి మెడలో జిల్లేడు ఆకులతోకాని లేదా పూలతో హారమును వేసి మినపప్పు మరియు ఉప్పును సమర్పిస్తారు.

2 అ 5. సిద్ధిప్రాప్తి

హనుమంతుని తాంత్రిక ఉపాసన ద్వారా మనోవాంఛలు నెరవేరును మరియు సిద్ధులను ప్రాప్తి చేసుకొనవచ్చునని ప్రజల నమ్మకము. ఈ తాంత్రిక ఉపాసనలో అనేక సిద్ధ మంత్రాల కలయిక ఉంటుంది.

2 ఆ. ప్రముఖమైన పూజలలోని ఆచారాలు మరియు అలవాట్ల వెనుక కారణములు

భారతదేశమంతటా శనివారము మరియు మంగళవారమును హనుమంతుని వారంగా పాటిస్తారు. ఈ రోజులలో హనుమంతునికి సింధూరము మరియు నూనెను సమర్పించు పద్ధతి కలదు. హనుమంతుడికి కొబ్బరికాయ కొట్టెపద్ధతి పూర్వం నుండి వస్తున్నది. ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు వామముఖి (ఎడమవైపు చూస్తున్న) మారుతి లేక దాసమారుతిని పూజిస్తారు.

2 ఆ 1. హనుమంతునికి నూనె, సింధూరము, జిల్లెడా కులు లేదా పూలను ఎందుకు సమర్పిస్తారు ?

పూజలో ఏ దేవతకు ఏ వస్తువులను సమర్పిస్తారో, ‘ఆ వస్తువులు ఆ దేవతకు ఇష్టము’, అని చెబుతారు, ఉదా: గణపతికి ఎర్రని పువ్వులు, శివునికి బిల్వపత్రము, విష్ణూమూర్తికి తులసి ఆ తర్వాత ఆ దేవతకు అది ఎందుకు ఇష్టమో చెప్పుటకు ఒక కథను చెబుతారు. వాస్తవానికి శివ, విష్ణు, గణపతి ఇలాంటి ఉచ్ఛదేవతలకు ఏదైనా వస్తువు గురించి ఇష్టాయిష్టములు ఉండవు. విశిష్ట వస్తువును విశిష్ట దేవతకు సమర్పించుటకు గల కారణాలు క్రింద ఇవ్వబడినవి.

పూజచేయు ఉద్దేశము మూర్తిలో చైతన్యము నిర్మాణ మగుట మరియు అది మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగ పడవలెనని ఉంటుంది. చైతన్యమును నిర్మాణము చేయుటకు దేవునికి ఏ వస్తువును సమర్పిస్తారో ఆ వస్తువులో మహాలోకము వరకు వ్యాపించిన ఆ దేవతల పవిత్రకాలను (సూక్ష్మాతి సూక్ష్మ చైతన్య కణములు) ఆకర్షించే క్షమత ఇతర వస్తువులకంటేె ఎక్కువగా ఉంటుంది. ఎర్రని పుష్పములలో గణపతి, బిల్వపత్రములో శివుని, తులసిలో విష్ణు మరియు నూనె, సింధూరము మరియు జిల్లేడు ఆకులు – పూలలో మారుతి యొక్క పవిత్రకాలను (సూక్ష్మాతి సూక్ష్మ చైతన్య కణములు) ఆకర్షించే క్షమత అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది; అందుకే మారుతికి నూనె, సింధూరము మరియు జిల్లెడు ఆకులను సమర్పిస్తారు.

2 ఆ 2. హనుమంతుడికి కొబ్బరికాయను ఎందుకు మరియు ఎలా సమర్పించాలి ?

కొబ్బరికాయ మంచి మరియు చెడు రెండు రకాల తరంగాలను ఆకర్షిస్తుంది, ప్రక్షేపిస్తుంది. కొబ్బరికాయను సమర్పించేడప్పుడు దాని జుట్టును హనుమంతుని వైపు చేసి హనుమంతుని సాత్త్విక స్పందనలు కొబ్బరికాయలో రావలెనని ప్రార్థించవలెను. ఆ తరువాత కొబ్బరికాయను కొట్టి సగభాగం మనం ఉంచుకొని మిగిలిన సగభాగం అక్కడి స్థానదేవతకు సమర్పించవలెను. దీనినుండి స్థానదేవత ద్వారా దేవాలయ పరిసరాలలోని హానికర శక్తులు, చిన్నభూతాలకు ఆహారము దొరుకుటచేత అవి సంతుష్టులౌతాయి, తరువాత మన కొరకు తీసి ఉంచిన సగభాగమును ప్రసాదంగా గ్రహించి దేవతలతత్త్వ లాభమును అధికంగా పొందవలెను. కొంత మంది భక్తులు దేవునికి కొబ్బకాయను పూర్తిగా సమర్పిస్తారు. కొబ్బకాయను పూర్తిగా సమర్పించుటచేత వారి మనస్సులో కేవలము త్యాగభావము అప్పుడప్పుడు నిర్మాణమౌతుంది; దానినుండి అతనికి ఆధ్యాత్మిక లాభము కలుగదు. కావున దేవునికి కొబ్బరి కాయను పూర్తిగా సమర్పించకండి; దీనికి బదులుగా కొబ్బరికాయను కొట్టి సగభాగము దేవునికిచ్చి సగభాగము మీ కొరకు ఉంచుకొని దేవత తత్త్వము యొక్క అధిక లాభమును పొందండి.

2 ఆ 3. శనిపీడ (7.5 సం॥ ఉండే బాధలు) మరియు హనుమంతుని పూజ

శనిపీడ (బాధలు) ఉన్నవారు బాధల నివారణకు హనుమంతుడిని పూజిస్తారు. పూజావిధానము క్రింద ఇవ్వ బడినది: ఒక గిన్నెలో నూనె తీసుకొని దానిలో పద్నాలుగు మినుములను వేసి దానిలో మీ ముఖము (ప్రతి బింబము) ను చూసుకొనవలెను. తర్వాత ఆ నూనెను మారుతికి సమర్పించవలెను. అనారోగ్యముతో ఉన్న వ్యక్తి హనుమంతుడి దేవస్థానమునకు వెళ్ళుటకు వీలుపడనప్పుడు, ఈ విధముగా హనుమంతుడి పూజ చేయవచ్చును. నూనెలో ముఖ ప్రతిబింబము పడినప్పుడు దుష్టశక్తి ప్రతిబింబము కూడా అందులో పడుతుంది. ఈ నూనెను మారుతికి సమ ర్పించినప్పుడు అందులో ఉన్న దుష్టశక్తి నాశనమౌతుంది.

నిజమైన గానుగవాడు (నూనె వ్యాపారి) శనివారము నూనెను అమ్మడు; ఎందుకంటే దుష్టశక్తి బాధలనుండి విముక్తి పొందుటకు వ్యక్తి మారుతికి నూనెను అర్పిస్తాడు, ఆ శక్తి ఆ నూనెను అమ్మేవానికి ఇబ్బందిని కలిగించే అవకాశము ఉంటుంది; అందువలన మారుతి దేవస్థానము సమీపములో నూనె అమ్ముతుంటే అక్కడి నుండి తీసుకెళ్ళకుండా ఇంటి నుండే నూనెను తీసుకువెళ్లి అర్పించవలెను.

ఆధారం : సనాతన లఘు గ్రంథం ‘హనుమంతుడు’

Leave a Comment