త్రిపిండి శ్రాద్ధం యొక్క ఉద్దేశం, చేసే విధానం, పద్ధతి !

1. వ్యాఖ్య : తీర్థక్షేత్రాలలో పితరులను ఉద్దేశించి చేసే శ్రాద్ధానికి త్రిపిండి శ్రాద్ధమని అంటారు.

2. ఉద్దేశం : మనకు తెలియని, మన వంశంలో సద్గతి దొరకని వారికి లేదా దుర్గతి ప్రాప్తించినవారికి,  మన వంశజులను పీడించే పితరులకు, వారి ప్రేతత్వం తొలగి సద్గతి దొరకాలని త్రిపిండి శ్రాద్ధం (అనగా భూమి, అంతరిక్షం మరియు ఆకాశాలలో ఉన్న ఆత్మలకు) చేయబడుతుంది. సాధారణంగా ఒకరిని ఉద్దేశించి లేదా వసు-రుద్ర-ఆదిత్య ఈ శ్రాద్ధ దేవతల పితృగణాల్లోని పిత-పితామహ-ప్రపితామహ ( తండ్రి, తాత, ముత్తాత) ఈ ముగ్గురిని ఉద్దేశించి చేసిన కర్మలు మూడు తరాలకు మాత్రమే ఉంటాయి. కాని, త్రిపిండి శ్రాద్ధ కర్మవలన ఆ మూడు తరాలకూ ముందున్న తరాలలోని పితరులకూ తృప్తి కలుగుతుంది. ప్రతి కుటుంబంలోనూ ఈ విధిని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి చెయ్యాలి. లేదా పితరుల వల్ల ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఈ విధిని దోష నివారణ కోసం చెయ్యాలి.

3. విధి :

3 అ. విధిని చెయ్యడానికి తగిన కాలం

1.     త్రిపిండి శ్రాద్ధం అష్టమి, ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణిమ, అలాగే పితృపక్షం అంతా, ఈ రోజుల్లో చేయవచ్చును.

2.     గురు శుక్రాస్తం, వినాయకోత్సవం, శరన్నవరాత్రులలో ఈ విధిని చెయ్యరాదు. అలాగే కుటుంబంలో మంగళ కార్యం జరిగిన తరువాత, అశుభ ఘటనల తరువాత ఒక సంవత్సరం వరకు ఈ శ్రాద్ధాన్ని చెయ్యరాదు. అనివార్యమయితే ఉదా: ఒక మంగళ కార్యం జరిగిన కొన్ని నెలల తరువాత మరొక మంగళ కార్యం ఉంటే ఆ మధ్యకాలంలో త్రిపిండి శ్రాద్ధం చెయ్యవచ్చును.

3 ఆ. విధిని చెయ్యడానికి తగిన ప్రదేశం :

త్ర్యంబకేశ్వర్, గోకర్ణ, మహాబలేశ్వర్, గరుడేశ్వర్, హరిహరేశ్వర్ (దక్షిణ కాశి), కాశి (బనారస్), ఈ ప్రదేశాలు త్రిపిండి శ్రాద్ధ కర్మ చేయడానికి తగిన స్థలాలు.

3 ఇ. పద్ధతి : ముందుగా తీర్థక్షేత్రంలో స్నానం చేసి, శ్రాద్ధ సంకల్పాన్ని చెయ్యాలి. తరువాత మహా విష్ణువును, కర్మకు పిలిచిన బ్రాహ్మణులకు శ్రాద్ధ విధి ప్రకారం పూజించాలి. తరువాత యవలు, బియ్యం, నువ్వులు వీటి పిండితో ఒక్కొక్క పిండం చెయ్యాలి. దర్భలను పరచి వాటి పైన తిలోదకాన్ని చిలకరించి పిండదానం చెయ్యాలి.

1. యవల పిండం (ధర్మ పిండం) : మాతృ వంశంలోని, పితృ వంశంలోని ఉత్తర క్రియకు నోచుకోని వారు, సంతానం లేకుండా ఎవరికి పిండప్రదానం జరగలేదో వారు, జన్మతః వికలాంగులు (న్యూనత వలన పెళ్ళి కాకుండా సంతాన హీనులైనవారు), ఇలాంటి పితరుల ప్రేతత్వం తొలగి సద్గతి దొరకాలని యవల పిండదానం చేస్తారు. దీనికి ధర్మపిండం అని కూడా ఇంకో పేరుంది.

2. మధురత్రయ యుక్త అన్న పిండం : పిండం పైన చక్కెర, తేనె, నెయ్యి వీటి మిశ్రమాన్ని వెయ్యడాన్ని మధురత్రయి అంటారు. దీనిని ఇవ్వడం వలన అంతరిక్షంలోని పితరులకు సద్గతి దొరుకుతుంది.

3. నువ్వుల పిండం : భూమి పైన క్షుద్రయోనిలో ఉండి, ఇతరులకు ఇబ్బంది కలిగించే పితరులకు నువ్వుల పిండం వలన సద్గతి కలుగుతుంది.

ఈ మూడు పిండాలకు తిలోదకం ఇవ్వాలి. తరువాత పిండాలను పూజించి అర్ఘ్యాన్నివ్వాలి. శ్రీ విష్ణువుకు తర్పణనివ్వాలి. బ్రాహ్మలకు భోజనం పెట్టి దక్షిణక్రింద వస్త్రం, పాత్రలు, విసన కర్ర, పాదరక్షలు ఇవ్వాలి.

4. పితృదోషం ఉంటే తల్లి తండ్రి జీవించి ఉన్నప్పుడే కుమారుడు విధిని చెయ్యడం యోగ్యమైనది : శ్రాద్ధ కర్త జాతకంలో పితృదోషం ఉంటే దాని నివారణార్థం తలిదండ్రులు జీవించి ఉండగానే ఈ విధిని చెయ్యాలి.

5. ఈ విధిని చేసేటప్పుడు శిరోముండనం అవసరం : శ్రాద్ధ కర్త తండ్రి బ్రతికి ఉంటే ముండనం అవసరం లేదు. జీవించి ఉండకపోతే తీయించాలి.

6. ఇంటిలో ఎవ్వరో ఒక్కరు విధిని చేస్తున్నప్పుడు ఇతరులు పూజ మొదలైనవి చేయవచ్చును : త్రిపిండి శ్రాద్ధ కర్తకు మాత్రమే అశౌచం ఉంటుంది. ఇతరులకు ఉండదు. కాబట్టి ఇంటిలోని ఒకరు విధిని చేస్తున్నప్పుడు ఇతరులు పూజ మొదలైనవాటిని నిలిపి వేయాల్సిన అవసరం లేదు.

7. త్రిపిండి శ్రాద్ధం గురించిన ఒక అనుభవం

అ. చనిపోయిన బాబాయ్ ఒక స్త్రీలో ప్రకటమయ్యి, తల్లి కింద పడేలా చేయడం, ఇంటి అమ్మకానికి ఇబ్బంది కలిగించడం గురించి చెప్పడం, త్రిపిండి శ్రాద్ధం చేసిన పిమ్మట ఇబ్బంది తొలగిపోవడం : “నా స్వయాన బాబాయ్ మా ఇంటి దగ్గరే ఒక లోగిలిలో ఉండేవారు. ఆయనకు సంతానం లేదు. ఆయన మా ముగ్గురు అన్నదమ్ములను, విశేషంగా నన్ను చాలా ప్రేమతో చూసేవారు. 13 సంవత్సరాల క్రితం కొందరు గూండాలు ఆయన పైన చేసిన దాడివలన ఆయన చనిపోయారు. మూడు సంవత్సరాల తరువాత ఆయన నవరాత్రుల్లోని ఎనిమిదో రోజున ఒక గుజరాతి స్త్రీలో ప్రకటమయ్యారు. తనకు ఇష్టమైన పదార్థాలు కావాలని ఆ స్త్రీ శుద్ధ మరాఠీలో పురుషుడి గొంతుతో మాట్లాడింది. తరువాత బాబాయ్ చాలా సంవత్సరాల వరకు ప్రకటమవ్వలేదు.

2004 లో నా తల్లిగారు కాలుజారి ఒక గుంటలో పడ్డారు. తరువాత ఆమె చాలా రోజులు అనారోగ్యంగా ఉన్నారు. 2004 సంవత్సరం నవరాత్రిలోని ఎనిమిదో రోజు నా బాబాయ్ అదే గుజరాతి స్త్రీలో ప్రకటమయ్యి, నన్ను పిలిపించారు. అప్పుడు అక్కడ చాలా మంది గుంపుగా ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన నా పై చాలా కోప్పడ్డారు. ఆయన ఆ స్త్రీ ద్వారా ఇలా చెప్పారు. “నా ఆత్మ ఇక్కడె తిరుగుతోంది. ఇంతకు ముందే నేను నీకు త్రిపిండి శ్రాద్ధ కర్మ చెయ్యమని చెప్పాను. కానీ నువ్వు మాత్రం ఇల్లు కొనే వ్యవహారంలో పడిపోయావు. ఎప్పటి దాకా నువ్వు నాకు ముక్తి కలిగించవో అప్పటి దాకా నేను నిన్ను ఇల్లు కొననివ్వను. నీ తల్లిని పీడిస్తాను. కొన్ని రోజుల క్రితం నేనే నీ తల్లిని పడదోశాను. నువ్వు త్రిపిండి శ్రాద్ధ కర్మ చేసేదాకా ఇలాగే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాను.” అన్నారు. నేను కొనదలచిన ఇంటి చిరునామాను కూడా సరిగ్గా చెప్పారు. ఇలా జరిగిన తరువాత నేను వెంటనే త్రయంబకేశ్వర్ కు వెళ్ళి త్రిపిండి శ్రాద్ధ కర్మ చేశాను. తరువాత ఇప్పటి దాకా బాబాయ్ ప్రకటమవ్వలేదు – శ్రీ నరేంద్ర సఖారామ్ సుర్వే, ఘాట్కోపర్, ముంబై.

(ఆధారం: సనాతన ప్రచురించిన గ్రంథం – శ్రాద్ధ కర్మ -2 భాగాలు )

Leave a Comment