శ్రాద్ధ కర్మను ఎప్పుడు చెయ్యాలి ?

అ. సాధారణ తగిన తిథులు : సాధారణంగా అమావాస్య, సంవత్సరంలోని పన్నెండు సంక్రాంతులు, చంద్ర-సూర్య గ్రహణాలు, ఉగాది, మన్వాది తిథులు, అర్ధోదయాది పర్వాలు, మరణించిన రోజు, శ్రోత్రియ బ్రాహ్మణులు ఆగమనం ఇత్యాది తిథులు శ్రాద్ధ కర్మకు తగిన రోజులు.

ఆ. శ్రాద్ధ కర్మను ఒక ప్రత్యేక సమయంలో చేయడానికి వీలుకాలేదు, కాబట్టి శ్రాద్ధ కర్మను చేయలేదు అని చెప్పే అవకాశం ఇవ్వని ధర్మం హిందూ ధర్మం !

1. సాధారణంగా ప్రతి సంవత్సరం మరణించిన తిథి రోజు (అంగ్ల క్యాలెండర్ ప్రకారం కాకుండా హిందూ పంచాగం ప్రకారం మరణించిన తిథి) శ్రాద్ధ కర్మను చెయ్యాలి. ఒకవేళ మరణించిన తిథి తెలియక, ఉత్త నెల మాత్రం తెలిసుంటే ఆ నెలలోని అమావాస్య రోజు శ్రాద్ధ కర్మను చెయ్యాలి.

2. ఒకవేళ చనిపోయిన తిథి, నెల రెండూ తెలియకపోతే మాఘ లేదా మార్గశిర అమావాస్య రోజు శ్రాద్ధ కర్మను చెయ్యాలి.

3. ఒకవేళ చనిపోయిన తిథి ఖచ్చితంగా తెలియకపోతే, మరణ వార్త తెలిసిన రోజు చెయ్యాలి.

4. పితరుల శ్రాద్ధ కర్మను వీలైతే ప్రతి రోజూ చెయ్యాలి. ఉత్త నీటితో తర్పణం వదలి చెయ్యవచ్చును.

5. అలా ప్రతిరోజూ చెయ్యడానికి వీలవకపోతే, దర్శ శ్రాద్ధం చెయ్యాలి. దీనివలన నిత్య శ్రాద్ధ సిద్ధి కలుగుతుంది. దర్శ అంటే అమావాస్య. ప్రతి అమావాస్య చేసే శ్రాద్ధమే దర్శ శ్రాద్ధం.

6. ప్రతి నెల దర్శ శ్రాద్ధం చెయ్యడానికి వీలవకపోతే చైత్ర, భాద్రపద, ఆశ్వయుజ మాసాల అమావస్య రోజు చెయ్యాలి.

7. అలా చెయ్యడానికి వీలు కాకపోతే భాద్రపద మాసంలోని పితృపక్షంలోని మహాలయ  శ్రాద్ధాన్నయినా తప్పకుండా చెయ్యాలి. అదీ వీలుకాకపోతే భాద్రపద అమావాస్య (సర్వ పితృఅమావాస్య) శ్రాద్ధాన్నయినా చెయ్యాలి.

సర్వ పితృ అమావాస్య ప్రాముఖ్యత : భాద్రప్రద అమావాస్య రోజు మన వంశంలోని అందరూ పితరులను ఉద్దేశించి శ్రాద్ధ కర్మ చెయ్యబడుతుంది. కాబట్టి ఈ అమావాస్యను సర్వపితృ అమావాస్య అని పిలుస్తారు. ఈ తిథిరోజు శ్రాద్ధకర్మ చెయ్యడం అత్యంత అవసరం. ఎందుకంటే ఇది పితృపక్షపు రోజుల్లోని చివరి రోజు.

వ్యక్తి యొక్క మరణపు తిథి తెలియకపోతే ఆయన మరణించిన నెలలోని అమావాస్య రోజు శ్రాద్ధ కర్మ చెయ్యవచ్చును. ఒకవేళ అది కూడా తెలియకపోతే సర్వపితృ అమావాస్య రోజు శ్రాద్ధ కర్మ చెయ్యవలెనని శాస్త్రాల్లో చెప్పబడింది.

శ్రాద్ధకర్మ చెయ్యడానికి అమావాస్య తగిన తిథి. పితృపక్ష అమావాస్య అన్ని తిథులకంటే ఉత్తమమైన తిథి అని శాస్త్రాల్లో చెప్పబడింది.

ఇతర దినాలలో లేదా వ్యక్తి మరణించిన తిథి రోజు శ్రాద్ధ కర్మ చెయ్యడానికి వీలుపడక పోతే సర్వపితృ అమావాస్య రోజు శ్రాద్ధ కర్మ చెయ్యడం వలన మృత వ్యక్తికి దాని ప్రయోజనం కలుగుతుంది.

మరణించిన వ్యక్తి శ్రాద్ధ కర్మ చేసే రోజు పురుడు (జనన శౌచం) లేదా సూతకం (మరణ శౌచం) వస్తే అప్పుడు సర్వపితృ అమావాస్య రోజు శ్రాద్ధ కర్మ చెయ్యవచ్చును.

ఈ రోజు చాలా మంది కనీసం ఒక బ్రాహ్మణుడినైనా భోజనానికి పిలవడం లేదా వారికి ఆహార సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది.

(హిందూ ధర్మం ఇన్ని అవకాశాలు ఇచ్చినా, హిందువులు శ్రాద్ధ కర్మలను చెయ్యడం లేదు – సంపాదకులు)

ఇ. శ్రాద్ధకర్మను ఏ సమయంలో చెయ్యాలి (సరైన సమయం)

రోజును 5 భాగాలుగా చేస్తే, అందులోని నాలుగవ భాగాన్ని “అపరాహ్నం” అంటారు. ఇది శ్రాద్ధ కర్మకు తగిన సమయం అని అర్థం చేసుకోవాలి.

(ఆధారం : సనాతన ప్రచురించిన గ్రంథం – శ్రాద్ధ కర్మ -2 భాగాలు )

Leave a Comment