శిష్యుని జీవితంలో ఆధ్యాత్మిక క్రమశిక్షణ

ఆధ్యాత్మికతలో ప్రాథమిక స్థాయిలో ప్రతి సాధకుడు, గురువే మోక్షానికి మార్గం అని చదివి ఉంటాడు. పురోగతి సాధించిన తరువాత దానిని తాను అనుభవిస్తాడు. చాలా మంది సాధకులు గురువును ఎలా సంపాదించుకోవాలో తెలుసుకో లేకుండా ఉన్నారు. ఆ కారణంగా ప్రస్తుత జన్మయే కాక రాబోయే అనేక జన్మలు కూడా వృథా అయిపోతాయి. ఒక గురువుకు శిష్యుడుగా స్వీకరించబడాలి అంటే సంతుల యొక్క అనుగ్రహం పొందాలి. ఏమయినప్పటికీ, గురువు గారి అనుగ్రహాన్ని నిరంతరం పొందాలి అంటే శిష్యుడు గురువు యొక్క ఆశీస్సులను సంపాదించుకోవాలి. దీనికి సులువైన పరిష్కారం ఏమిటంటే గురువులు, సంతులు ఆశించే  ఆధ్యాత్మిక సాధనే. ఈ రచన ఆధ్యాత్మిక క్రమశిక్షణ, సాధకుడు సమాజంలో వ్యవహరించవలసిన తీరు, శిష్యునికి ఉండవలసిన జీవన విధానము గురించి ఆచరణాత్మకమైన సమాచారాన్ని అందిస్తుంది.

 

1. సమాజంలో వ్యవహరించ వలసిన తీరు

శిష్యుడు, సమాజంలో సత్ప్రవర్తన కలిగి ఉండాలి. లేకపోతే, జనం ‘గురువు వీడికి ఇదేనా నేర్పించినది‘ అని గురువును నిందిస్తారు. శిష్యుని యొక్క ప్రతి పని, మాట, ఆలోచన గురువుకు ఆమోద యోగ్యమైనవిగా ఉండాలి. ఉదాహరణకు, అతడు పరులను నిందించడం, అనైతికంగా ప్రవర్తించడం మొదలైనవి చేయరాదు.

 

2. అనారోగ్యానికి గురైనప్పుడు చికిత్స తీసుకోవాలి

అనారోగ్యానికి గురైనప్పుడు మందులు వాడకూడదు అనేటట్లైతే ఐదవ వేదంగా పరిగణింపబడే ఆయుర్వేదం వ్రాయబడి ఉండేది కాదు. అంటే కాకుండా, భౌతిక శరీరం ఆధ్యాత్మిక సాధనకు మాధ్యమం అంటారు. అనారోగ్యం ద్వారా తన ప్రారబ్ధం తాను అనుభవిస్తున్నాను అని భావించి ఎవరూ కూడ చికిత్స తీసుకోవడం మానరాదు, ఎందుకంటే, ఆ రోగము ప్రారబ్ధం వ వచ్చినదా లేక ఏదైనా ఉద్దేశపూర్వక చర్య వలన వచ్చినదా అనేది తెలియదు కాబట్టి.

 

3. భుజించడం

శిష్యుడు తాను గురువు యొక్క ఉచ్చిష్టాన్ని స్వీకరిస్తున్నాననే నమ్మకంతో తింటాడు. అందు చేత అతను చిత్రాహుతి సమర్పించడు.

ప్రశ్న : గురువు ఉచ్చిష్టాన్ని ఎందుకు భుజిస్తారు ?

సమాధానం : గురువు నిరంతరం భగవత్‌ నామ జపం చేస్తూ ఉంటారు. తాము కూడా అలా చేయగలగటానికి గురువు ఉచ్చిష్టాన్ని భుజిస్తారు. మరే ఇతర ఉద్దేశంతోనూ గురువు ఉచ్చిష్టాన్ని భుజించరాదు.

 

4. నిజమైన బంధం

జీవునికి(ఆత్మా), శివునికి (భగవంతునికి), అనగా శిష్యునికి, గురువుకి మధ్య గల బంధం మాత్రమే నిజమైన బంధము. భ్రాంతి నుండి ఏర్పడే తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పిల్లలు మొదలగు అన్య బంధాలు అన్నీ అవాస్తవాలే.

 

5. తల్లిదండ్రులు ఇచ్చిన, మరియు గురువు ప్రసాదించిన పేరు

అ. తల్లిదండ్రులు పెట్టిన పేరు భౌతిక శరీరమునకు (ప్రకృతి) సంబంధించినది. గురువు ఇచ్చిన పేరు (ఈశ్వర నామము) భగవత్‌ తత్వాన్ని అనుసరించి ఉంటుంది.

ఆ. తల్లిదండ్రులు పెట్టిన పేరు మన మనస్సుపై ముద్రపడి పోవడం వలన, అది మనదే అనే భావన మనకు కలుగుతుంది. అలాగే, గురువు ప్రసాదించిన భగవద్నామం కూడా మనపై ముద్ర పడి (నామ జపం ద్వారా), నాది అనే భావన మనలో కలిగేలా చేసుకోవాలి. గురువు ప్రసాదించిన నామము మనం వేరొకరికి (గురు తత్వానికి) చెందిన వారమని సూచిస్తుంది. తరువాత, తల్లిదండ్రులు పెట్టిన పేరు మర్చిపోయి, భగవద్‌ నామమే తనదనే భావన కలగాలి.

ఇ. పుత్రుడు తల్లిదండ్రుల పేరును ముందుకు తీసుకు వెళ్తాడు, శిష్యుడు గురువు ప్రసాదించిన నామమును.

 

6. ఆశ్రమంలో ఏ విధంగా నడుచుకోవాలి?

అ. ఆశ్రమంలో ఉంటున్నప్పుడు ధర్మశాలలో ఉంటున్నట్లు ప్రవర్తించ రాదు.

ఆ. గురువుకు చెందిన పాదుకలు, దుప్పట్లు మొదలగు వస్తువులను గురు ప్రసాదంగా భావించి, ఎవరికీ చెప్పకుండా ఆశ్రమం నుండి తీసుకు వెళ్ళరాదు.

ఇ. ఆశ్రమంలో ఉంటున్నప్పుడు మరెవరికీ మనం భారం కాకుండా చూసుకోవాలి.

మన వల్ల ఆశ్రమంలో ఉంటున్న ఇతరులపై పని భారం పెరగకుండా, మన ఉనికి వలన వారిలో మానసిక ఒత్తిడి ఉండకుండా చూసుకోవాలి. మనం ఆర్థికంగా కూడా ఆశ్రమానికి భారం కాకూడదు. మన పడక సదుపాయాలు మనమే చేసుకోవాలి.

ఈ. భౌతిక, మానసిక, ఆర్థిక మొదలగు అన్ని కోణాల్లో కూడా మనం ఆశ్రమంలో ఉండడం వలన ఆశ్రమానికి ఏదైనా మేలు చేయగలగాలి. ఆశ్రమంలో మనకు విధించిన ఏ పనినైనా గురు సేవగా భావించి చెయ్యాలి.

ఉ. ఆశ్రమం యొక్క నియమ నిబద్ధతలను తప్పక పాటించాలి.

ఊ. ఆశ్రమంలో నివసించడానికి ఉన్న ప్రాముఖ్యత : ఆశ్రమంలో నివసించడం మన ఇంటితో ఉన్న బంధాన్ని, దేహ బుద్ధినీ తగ్గించుకోవడానికి, ఇతరులను మన కుటుంబ సభ్యులుగా భావించడం నేర్చుకోవడానికి, మనలోని అహంకారాన్ని తగ్గించుకోవడానికి  ఎంతగానో తోడ్పడుతుంది.

 

7. ఇతర గురువులు, సంతుల పట్ల ప్రవర్తన

అ. మనం మన గురువు పట్ల కచ్చితంగా విశ్వాసంతో వ్యవహరించాలి, అలాగే, ఇతర గురువుల పట్ల ద్వంద్వ వైఖరి ఉండకూడదు. ‘నా గురువు ఇతరుల కన్నా గొప్పవాడు’ అనే భావం అజ్ఞానానికి ప్రతీక.

ఆ. ఇద్దరు సంతులను ఎప్పుడూ పొల్చరాదు

  •  ఆధ్యాత్మిక ప్రగతి సాధించిన ఇద్దరిని ఎప్పుడూ పోల్చరాదు. ‘వారు వారు గానే ఉండనీ, నువ్వు నువ్వు గానే ఉండు, నేను ఉన్నచోట నాకు నిలకడ నివ్వు‘ అని సాధకుడు అనుకోవాలి.
  • ఇద్దరు సంతుల మధ్య తేడాను ఎప్పుడూ కొలవరాదు. మూర్తీభవించిన ఆత్మలను ఎప్పుడూ పోల్చరాదు.

      అంతరార్థం : ఇద్దరు సంతుల మధ్య తేడాను పోల్చేవాడు వారిరువురి కన్నా ఉన్నతమైన వాడు అయి ఉండాలి. అలా అయినప్పటికీ, తుదకు అంతా బ్రహ్మమే కాబట్టి ఇద్దరూ సంతులను కానీ రెండు          ప్రాణులను కానీ పోల్చలేము. అంతే కాకుండా, అందరూ ఈశ్వరేచ్ఛకు, వారి ప్రారబ్ధానికీ అనుగుణంగా నడుచుకుంటారు కాబట్టి, పోలిక అసమంజసం.

ఇ. ఇద్దరు వ్యక్తుల స్వభావములు వేరుగా ఉంటాయి, కానీ వారి తత్వం ఒక్కటే

అంతరార్థం : వ్యక్తుల లోని సత్వ, రజ, తమో గుణముుల వ్యత్యాసము వలన వారి స్వభావములు వేరుగా ఉంటాయి. కానీ అందరికీ చెందిన తత్వము ఆత్మ లేదా బ్రహ్మ తత్వము.

 

సందర్భం : సనాతన సంస్థ ప్రచురణ ‘శిష్యుడు’

Leave a Comment