ఎవరిని నిజమైన గురువులని అనవచ్చు?

దేశమునకు, ధర్మమునకు అపాయం ఏర్పడినప్పుడు దైవ భక్తిలో  పరిపూర్ణంగా లీనమవ్వమని కాకుండా ఆధ్యాత్మిక సాధనలో భాగంగా దేశం-ధర్మం రక్షణకు క్రియాశీలురుగా ఎలా కావడం అని బోధించే వారే ఉత్తమమైన గురువులు. నేటి ప్రతికూల పరిస్థితులలో ఉత్తమ గురు సేవ అంటే దేశం-ధర్మం  రక్షణకు మన వంతు కృషి చేయడమే.

 

‘గురువు‘ అనే పదమునకు అర్థము

ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు, సాధకులు, మరియు భక్తుల చుట్టూ అజ్ఞానం రూపంలో ఉన్న మాయ అనే పొరను తొలగించి, వారు తమ నిజ స్వరూపమును తెలుసుకునేలా చేసే వారే గురువు.

తన స్వంత ప్రవర్తన, మార్గనిర్దేశనం ద్వారా భగవంతుడిని తెలుసుకునే మార్గమును చూపించి, చివరకు భగవంతుడిని తెలుసుకునేలా చేసే వారే గురువు.

నేడు కొందరు దొంగ సాధువులు గురువు అనే పదమునకు కళంకము తెస్తున్నారు. కొన్ని ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి

1. కొందరు సనాతన ధర్మ వ్యతిరేకులు శంకరాచార్య వేషధారణతో ధర్మమనే పేరుతో హిందువులను దోచుకుంటున్నారు – స్వామీ అవిముక్తేశ్వరానంద

2. 2013 యొక్క ప్రయాగ కుంభ మేళాలో ఒక వ్యక్తి ‘బాబా‘గా చెలామణీ అవుతూ, భారతీయ భక్తులను తన కుటీరం బయట రోజంతా నిరీక్షణలో ఉంచి, తాను విదేశీయులతో మాటలలో నిమగ్నుడై ఉండే వాడు. అతడు, కొందరు విదేశీ భక్తులకు, ‘మహా మండలేశ్వరుడు‘ అను హోదాను కూడా ఇచ్చాడు.

ఇటువంటి దొంగ సంతుల వల్లనే, ‘గురువు‘ యొక్క స్థాయికి కళంకము ఏర్పడి, జనులకు గురువు మీదా, తద్వారా ధర్మము మీదా గల విశ్వాసము దెబ్బతింటుంది. ఇటువంటి దొంగ గురువుల విషయంలో సంతు తుకారాం మహారాజ్‌ గారు ఒక సలహా ఇచ్చారు -‘పైకి అబద్ధపు వైరాగ్యమును నటిస్తూ లోలోపల లౌకిక సుఖాలను అనుభవించే వారిని చెప్పులతో కొట్టాలి’. మనం అటువంటి దొంగ సంతుల మాయలో చిక్కుకున్నామా అని మనం ఆలోచించుకోవాలి.

 

ఎవరు నిజమైన గురువులు?

‘ఈశ్వరుని నామమును శిష్యులకు ప్రసాదించే గురువులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈశ్వరుని నామము వారిలో శాశ్వతంగా నిలిచి ఉండేలా చేసే గురువులు కొందరే ఉన్నారు. వారే అసలైన గురువులు‘ అని సనాతన సంస్థకు స్ఫూర్తిప్రదాత అయిన పరమ పూజ్య. భక్తరాజ్‌ మహారాజ్‌ గారు (బాబా) అనేవారు. ఎందరో గురువులు భగవంతుడి నామమును ప్రసాదించి ‘ప్రతి రోజూ ఇన్ని మాలలు ఈ నామ జపం చెయ్యండి‘ అని చెబుతారు. కానీ ఒక నిజమైన గురువు నామమును ప్రసాదించినప్పుడు, శిష్యుడు నామ జపం జరగడానికి పెద్దగా కృషి చేయవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ గురువు యొక్క సంకల్ప శక్తి వలన శిష్యుడి మదిలో నామ జపం దానంతట అదే జరుగుతూ ఉంటుంది. అటువంటి గురువు తమ శిష్యుడికి నామము ప్రసాదించినప్పుడు, ఆ శిష్యుడు సాధన మానేసినా ఆ నామము అతడిని విడువదు. నిజమైన గురువు యందు అంతటి శక్తి ఉంటుంది. పరమ పూజ్య బాబా గారి శిష్యులు ఎందరో ఇది స్వయంగా అనుభవించారు.

2. బాందా, సింధుదుర్గ్‌ కు చెందిన సంతు పూజ్య దాస్‌ (రఘువీర్‌) మహారాజ్‌ గారు శ్రీధర స్వామి యొక్క శిష్యులు. పూజ్య దాస్‌ మహారాజ్‌ గారు పరాత్పర గురువు డా. ఆఠవలే గారిని కలవడానికి గోవా లోని సనాతన ఆశ్రమమునకు వచ్చినప్పుడు ఆయనకి పరాత్పర గురువు డా. ఆఠవలే గారిలో తన గురువు గారి దర్శనం జరిగి, భావంలో మునిగిపోయారు. నిజమైన గురువులు తొలి పరిచయం లోనే ఇంతటి ఉన్నతమైన అనుభవాలను ప్రసాదించగల శక్తి కలిగి ఉంటారు. ఇది కేవలం సనాతన సాధకులు మాత్రమే కాక, సమాజం లోని మిగతా వారు కూడా అనుభవించారు.

ఒక నిజమైన గురువు యొక్క మహాత్వాన్ని తెలుసుకోవడానికి ఈ ఉదాహరణలు చాలు.

 

ఆరోహణ క్రమంలో గురువులలో రకములు

నిజానికి అందరు గురువులూ గురు తత్త్వాన్ని కలిగి ఉంటారు. గురువులను మరొకరితో ఎప్పుడూ పోల్చ కూడదు. కానీ రజ, తమో గుణములు ప్రబలంగా ఉన్న ఈ రోజులలో సరి అయిన గురువు మార్గనిర్దేశంలో సాధన చేసిన వారు త్వరగా ఆధ్యాత్మిక ప్రగతి సాధించి, ఈశ్వరుడిని తెలుసుకుని, జనన మరణ చక్రం నుండి విముక్తి పొందగలరు. కాబట్టి, గురువులలో రకముల గురించి ఆరోహణ క్రమంలో క్రింద ఇవ్వబడింది.

1. మన కోరికలు తీర్చుకునే ఆశను కల్పించి, ఆ ప్రకారంగా సాధన నేర్పించే గురువులు

ఒక ప్రముఖ గురువు తన శిష్యులకు విజ్ఞప్తి చేసుకున్నారు ‘నేను మీ లౌకికమైన సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాను. కానీ మీరు నేను చెప్పే నామమును జపించండి‘. శిష్యులు భగవద్‌ నామాన్ని జపించాలి అనే ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఈ విజ్ఞప్తి శిష్యులు మాయలో చిక్కుకునేలా చేస్తుంది కాబట్టి ఇది మంచిది కాదు. అటువంటి భక్తుడు భగవంతుడిని తెలుసుకునేటందుకు అవసరమయ్యే మార్గంలో పయనించలేడు.

2. వ్యష్టి సాధన మాత్రమే సూచించే గురువులు

వ్యష్టి సాధన అంటే వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రగతికై కృషి చేయడం. సమిష్టి సాధన అంటే సమాజం యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కొరకు కృషి చేయడం. కొందరు గురువులు వ్యష్టి సాధన మాత్రమే నేర్పిస్తారు. అంటే, ఆ సాధకుని ప్రయాణం సూక్ష్మ శరీరం నుండి విశ్వంలోకి సాగుతుంది కానీ విశ్వం నుండి సూక్ష్మ శరీరంలోకి ప్రయాణం పూర్తి చేయలేకపోతారు. అటువంటి సాధకులు ముక్తిని మాత్రమే పొందగలుగుతారు; భగవంతుని సాక్షాత్కారం పొందలేరు. మరణించిన తరువాత పై లోకములలో వారు సమష్టి సాధన చేయవలసి ఉంటుంది. అప్పుడే భగవంతుని సాక్షాత్కారం జరుగుతుంది. ఈ విధంగా, భగవత్‌ సాక్షాత్కార స్థితికి చేరటానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది.

3. వ్యష్టి సాధన చేస్తూనే ఆధ్యాత్మికత ప్రచారం చేయమని చెప్పే గురువులు

‘మనకు తెలిసినది ఇతరులకు నేర్పించాలి‘ అనే సూత్రం ప్రకారం కొందరు గురువులు శిష్యులకు అధ్యాత్మికతము ఎలా ప్రచారం చెయ్యాలో నేర్పిస్తారు. సరి అయినదే అప్పటికీ ఈ బోధన సమగ్రమైనది కాదు. ఇందులో సమాజం గురించిన ఆలోచన ఉంది కానీ దేశ మరియు ధర్మ ఉద్ధరణ అనే ఉద్దేశం లేదు. ధర్మము, దేశమునకు ప్రాణము వంటిది. ధర్మము, దేశము, తరచూ దాడికి గురి అవుతున్నప్పుడు సమాజం ఏ విధంగా రక్షింపబడుతుంది? సమాజము రక్షింపబడనప్పుడు ఒక భక్తుడు సాధన ఎలా చెయ్యగలడు, ధర్మ ప్రచారం ఎలా చెయ్యగలడు? అలాగే, దేశము, ధర్మము పై తరచూ జరుగుతున్న దాడుల వలన సామాజిక జీవనం అస్థిరతకు గురి కావడమే కాకుండా సమాజం దోచుకోబడి ఎప్పుడూ భయంలో బ్రతుకుతుంది.

4.వ్యష్టి సాధనతో పాటు ఆధ్యాత్మికత ప్రచారము, దేశ, మరియు ధర్మ రక్షణ కూడా నేర్పించే గురువులు

సమాజానికి, దేశానికి మరియు ధర్మానికి వచ్చే ప్రతి ముప్పు మనందరిలో వ్యక్తిగత, సామాజిక, జాతీయ మరియు మతపరమైన బంధాన్ని తీసుకు వస్తుంది. శిష్యుడిని ముక్తి మార్గంలో నడిపించే నిజమైన గురువు అతడిని ఇటువంటి బంధనాల నుండి కూడా విముక్తుడిని చేయనవసరం లేదా? నిజానికి ఇటువంటి బృహత్‌ కార్యమే నిజమైన గురువు యొక్క లక్ష్యం. భావోద్వేగాలలో చిక్కుకుని తన ధర్మము నుండి తప్పుకోబోయిన అర్జునుడిని కురుక్షేత్ర యుద్ధంలో పోరాడమని శ్రీ కృష్ణ భగవానుడు ప్రేరేపించాడు; తద్వారా ధర్మ పరమైన పాలనను స్థాపించడంలో ఆదర్శం ఏర్పరిచాడు. ఇందుకే మనం కృష్ణుడిని పూజిస్తాము – ’కృష్ణం వందే జగద్గురుం ’ (జగద్గురువు అయిన శ్రీ కృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను)

ఈ సాధనలో భాగంగా సాధకులను (ధార్మికులను) రక్షించడం, చెడు ప్రవృత్తులను నిర్మూలించి, గురువు మార్గ నిర్దేశంలో ధర్మమును పునరుద్ధరించడం ఒక శిష్యుడికి ఎంతో ముఖ్యమని మనం తెలుసుకున్నాము.

Leave a Comment