గురుతత్త్వం ఒకటే !

అందరు గురువులు బాహ్యతః స్థూలదేహ విషయంలో వేర్వేరుగా ఉన్నా అంతరంగంగా మాత్రం ఒక్కటి గానే ఉంటారు. ఆవు పొదుగులో దేన్నుండి పితికినా సమానంగా నిర్మలమైన పాలు వచ్చినట్లే అందరి గురువులలోని గురుతత్త్వం ఒకటే అవడంవల్ల వారి నుండి వచ్చే ఆనంద తరంగాలు సమంగా ఉంటాయి. సముద్రపు అలలు ఒడ్డు వైపు వచ్చే విధంగా బ్రహ్మ/ఈశ్వరుల అలలు, అనగా గురువులు సమాజం వైపు వస్తారు. ప్రతి అలలోని నీటి రుచి ఎలా ఒకే రకంగా ఉంటుందో అలాగే అందరి గురువుల లోనూ ఉన్న గురుతత్త్వం ఒకటే, అనగా బ్రహ్మమే ఉంటుంది. నీటి తొట్టికి చిన్న పెద్ద కుళాయిలున్నప్పటికీ ప్రతి కుళాయి నుండి తోట్టిలోని నీరే వస్తుంది. విద్యుచ్ఛక్తి నుండి వెలిగే దీపాలు వేర్వేరు ఆకారాలలో ఉన్నా, వాటిలోని ప్రకాశం మాత్రం విద్యుచ్ఛక్తి నుండి వచ్చినదే. అలాగే బయటి రూపానికి గురువులు వేర్వేరుగా ఉన్నప్పటికీ వారందరిలోను ఉన్న గురుతత్త్వం, అనగా ఈశ్వరి తత్వం మాత్రం ఒకటే. గురువు అనగా కనిపించే స్థూల దేహం కాదు. గురువులకు సూక్ష్మ దేహం (మనస్సు) మరియు కారణ దేహం (బుద్ధి) లేకపోవడం మూలాన వారు విశ్వమనసు మరియు విశ్వబుద్ధితో పాటు ఏకరూపమై ఉంటారు. గురువులందరి మనసు మరియు బుద్ధి, విశ్వమనసు మరియు విశ్వబుద్ధి కావడం వలన వారందరూ ఒకేలా ఉంటారని దీనర్థం.

Leave a Comment