ఆరోగ్యవంతంగా వుండుటకు భోజన సమయ పాలన ముఖ్యం !

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, మనం ఏమి తినాలి మరియు ఎంత తినాలి కాకుండా, తినే ఆహారం అంతా సరిగా జీర్ణమవుతుందా లేదా అనేది గమనించాలి. ఎప్పుడూ తింటూ ఉండటం మంచిది కాదు. ముందు తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవడం స్పష్టమైన సాధారణ నియమం. ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే, ఆయుర్వేదం సూచించిన విధంగా భోజన సమయాన్ని అనుసరించాలి. ఈ నియమాలపై ప్రస్తుత లేఖనం మార్గదర్శకత్వం చూపుతుంది.

 

1. భోజన సమయాలు ఎప్పుడు వుండాలి?

1 అ. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ప్రస్తావించబడిన సూచనలు

అన్ని పురాతన ఆయుర్వేద పవిత్ర గ్రంథాలలో, ఉదయం మరియు సాయంత్రం భోజనానికి సూచనలు వున్నాయి. మధ్యాహ్నం భోజనం లేదా రాత్రి భోజనం గురించి ప్రస్తావనే లేదు.

1 ఆ. అర్థరాత్రి తినడం వెనుక గల ప్రధాన కారణం

విద్యుత్తు మన ఇళ్ళకు చేరిన తరువాత రాత్రి భోజనం తినడం అలవాటు అయ్యింది. దూరదర్శనిలో కార్యక్రమాలను చూడటానికి అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండటం అలవాటు పడి ఆలస్యంగా విందు చేయడం ప్రారంభించాము. దీనితో క్రమంగా అజీర్ణ సంబంధిత సమస్యలు ప్రారంభించాయి.

1 ఇ. ఆయుర్వేదం ప్రకారం భోజనానికి అనువైన(ఆదర్శమైన) సమయాలు

ఆయుర్వేదం ప్రకారం, భోజనం చేయడానికి అనువైన సమయం ఉదయం 9 నుండి 10 వరకు మరియు సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు (అనగా సూర్యాస్తమయానికి ముందు). పూర్వ కాలంలో ప్రజలు ఈ భోజన సమయాలను ఖచ్చితంగా పాటించేవారు కాబట్టి, వారు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేవారు. ఈ రోజుల్లో కూడా భారీ శారీరక శ్రమలో పాల్గొనే వ్యక్తులు ఈ సమయాలను అనుసరిస్తారు. ఈ సమయాలను అనుసరించగల వారు ఖచ్చితంగా వాటికి కట్టుబడి ఉండాలి, అయినప్పటికీ మన జీవితం మరియు రోజువారీ దినచర్య సమాజంతో ముడిపడి ఉన్నందున, చాలా సార్లు ఈ సమయాలను అనుసరించడం కష్టమవుతుంది. అందువల్ల ప్రత్యామ్నాయ సమయాలు క్రింద ఇవ్వబడ్డాయి.

1 ఈ. ఆదర్శమైన భోజన సమయాలకు ప్రత్యామ్నాయం

ప్రధాన భోజనం ఉదయం 11:30 మరియు సాయంత్రం 7 గంటలకు తీసుకోవాలి. నేటి ఆధునిక జీవనశైలికి ఈ భోజన సమయాలు పరిపూరకమైనవి మరియు
అన్నింటికీ అనుగుణంగా ఉంటాయి.

 

2. భోజన సమయాన్ని నిర్ణయించడం వెనుక ఉన్న ప్రాథమిక సూత్రాలు

2 అ. జీర్ణ క్రియ సూర్యుని స్థానం మీద ఆధారపడి ఉంటుంది

మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసే బాధ్యత మన లోపలి జఠరాగ్నిపై ఆధారపడి ఉంటుంది. ఈ జఠరాగ్ని, అనగా జీర్ణక్రియ ఆకాశంలో సూర్యుని స్థానం మీద ఆధారపడి ఉంటుంది. ఆకాశంలో సూర్యుడు ఉంటే, ఆ సమయంలో మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. కాలానుగుణ నియమావళి ప్రకారం, వర్షాకాలంలో ఎక్కువ కాలం మేఘావృతమైన ఆకాశం కారణంగా, ఆయుర్వేదం ప్రకారం చాలా తేలికపాటి భోజనం లేదా వీలైతే ఉపవాసం ఉండాలని సూచించారు. ఇది ఆకాశంలో సూర్యుడి ఉనికికి మరియు మన జీర్ణ శక్తికి మధ్య సన్నిహిత సంబంధాన్ని చూపుతుంధి.

2 ఆ. సూర్యాస్తమయం తరువాత 1.5-2 గంటలు వరకు మంచిగా జీర్ణక్రియ ఉంటుంది.

సూర్యోదయం తర్వాత 3 నుండి 3.5 గంటల తరువాత భోజనం చేయడం మరియు సూర్యాస్తమయానికి అరగంట ముందు రాత్రి భోజనం చేయడం అనువైనది. ఈ ఆదర్శ సమయం పైన పేర్కొన్న సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆదర్శ సమయాన్ని అనుసరించడం అసాధ్యం అయితే, ప్రత్యామ్నాయంగా, సమయాన్ని 2 నుండి 2.5 గంటలు పొడిగించవచ్చు. ఎందుకంటే జీర్ణశక్తి అంత సమయం వరకు మంచిగా ఉంటుంది.

2 ఇ. మధ్యాహ్నం భోజనంతో పోల్చితే రాత్రి భోజనం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది

మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది కాబట్టి, జీర్ణక్రియతో సహా శరీర కార్యకలాపాలన్నీ నెమ్మదిగా జరుగుతాయి. అందువల్ల రాత్రి భోజనం పూర్తిగా జీర్ణం కావడానికి సుమారు 12 నుండి 14 గంటలు పడుతుంది. దీనితో పోల్చితే, ఉదయం భోజనం ఆకాశంలో సూర్యుడు ఉండటం వల్ల 8 గంటల్లో పూర్తిగా జీర్ణమవుతుంది. అందువల్ల ఉదయం భోజనం చేసిన 8 గంటల తర్వాత రాత్రి భోజనం తినాలని, రాత్రి భోజనం తర్వాత 12 నుంచి 14 గంటలు తరువాత ఉదయం భోజనం తీసుకోవాలని సూచించబడింది.

2 ఈ. జీర్ణక్రియ యొక్క గరిష్ట భాగం, నిద్ర పోవడానికి ముందు పూర్తి అవ్వాలి

రాత్రి నిద్ర పోవడానికి ముందు, జీర్ణక్రియ యొక్క గరిష్ట భాగం పూర్తి అవ్వాలి. అందువల్ల, సూర్యాస్తమయం తరువాత 1.5 నుండి 2 గంటలలోపు రాత్రిభోజనం చేయాలి.

 

3. చిరుతిండి సమయాలు

ధర్మశాస్త్రంలో, అలాగే ఆయుర్వేదంలో, రోజుకు రెండుసార్లు మాత్రమే తినాలని మరియు మధ్యలో ఏమీ తినకూడదని అంటారు; కానీ ఈ రోజుల్లో ఇది అందరికీ సాధ్యం కాదు. ఆకలితో ఉన్నప్పుడు,తినకుండా బలవంతంగా నియంత్రించకూడదు. ఇది శరీర నొప్పులు, ఆకలి లేకపోవడం, వికారం, సన్నని శరీరం, కడుపు నొప్పి మరియు మైకముకి దారితీస్తుంది. ఇందుకోసం, రెండు భోజనాలకు మూడు నుంచి మూడున్నర గంటల ముందు చిరుతిండి తీసుకోండి. మీరు ఉదయం 9 గంటలకు తినాలనుకుంటే, ప్రత్యేక అల్పాహారం తీసుకోకండి. ఉదయం 9 గంటలకు భోజనం చేసి, మధ్యాహ్నం 2 గంటలకు అల్పాహారం తీసుకోండి. మీరు ప్రత్యామ్నాయ సమయాల్లో తింటుంటే, ఉదయం 8 లేదా 8.30 గంటలకు మరియు సాధారణంగా మధ్యాహ్నం 4 గంటలకు అల్పాహారం తీసుకోండి.

అల్పాహారం ఎంత తినాలి?

ఈ ప్రశ్నకు సమాధానం అల్పాహారం అనే పదంలోనే ఉంది. అల్పాహారం అల్పంగా ఉండాలి.

పరిమాణం ఎలా ఉండాలంటే అల్పాహారం తిన్నా 3 గంటల తరువాత భోజన సమయానికి చాలా ఆకలిగా ఉండాలి. ఎవరికి వారు వారి జీర్ణ క్రియను అర్థం చేసుకోవాలి మరియు కొద్దిగా ఆకలితో ఉండేటట్లు అల్పాహారం తినాలి. ఎక్కువగా అల్పాహారం తీసుకుంటే ప్రధాన భోజన సమయానికి ఆకలిగా అనిపించదు. అలాంటి సందర్భంలో, అది భోజన సమయం కనుక, ఆకలిలేక పోయినా, ఆహారాన్ని ఒక దినచర్యగా తీసుకుంటారు. ఆకలి లేనప్పుడు తినే ఆహారం జీర్ణం కాదు. ఆహారం జీర్ణించుకోకపోతే అది శరీరానికి హానికరమని రుజువు చేస్తుంది మరియు శరీరానికి పోషకాలను అందించకుండా వ్యాధులకు దారితీస్తుంది.

 

4. ఆహారాన్ని తీసుకునే సమయ పట్టిక

పైన పేర్కొన్న నిబంధనలకు కట్టుబడి ఉండటానికి, ఆహారాన్ని తినడానికి సమయ పట్టిక క్రింద ఇవ్వబడింది.

అనువైన సమయం

ప్రత్యామ్నాయ సమయం

అల్పాహారం (ఉదయం) ఉదయం 8 లేదా 8:30
భోజనం (ఉదయం) ఉదయం 9 గం ఉదయం 11:30
అల్పాహారం (మధ్యాహ్నం) మధ్యాహ్నం 2 గంటలకు సాయంత్రం 4 గంటలకు
విందు (సాయంత్రం) సాయంత్రం 5 గంటలకు రాత్రి 7 గంటలకు

 

5. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు

శరీరమాధ్యం ఖలు ధర్మసాధనమ్‌ |

అర్థం : ధర్మసాధనకు శరీరం మొదటి సాధనం అనే సామెత ఉంది.

సాధన చేయగలిగేలా దేవుడు ఈ శరీరాన్ని మనకు బహుమతిగా ఇచ్చాడు. శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం, తద్వారా ఈ శరీరంతో ఎక్కువ సాధన చేయవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఆహారం తినడానికి సమయ పట్టికను అనుసరించాలి. విద్య, ఉద్యోగం, సేవ మొదలైన వాటి వల్ల ఈ సమయ పట్టికను అనుసరించలేకపోతున్న వారు వారితో ఆహారాన్ని సర్దుకొని తీసుకెళ్ళాలి లేదా పైన ఇచ్చిన విధంగా ఆహారం తీసుకోవడానికి తగిన సమయాలను నిర్ణయించుకోవాలి.

– వైద్యులు మేఘరాజ్‌ మాధవ్‌ పరాడ్కర్‌, సనాతన ఆశ్రమం, రామనాథి, ఫోండా, గోవా.

Leave a Comment