ఎండాకాలం అయినా వ్యాయామం మానకండి!

ఆరోగ్యకరమైన జీవితానికి వ్యాయామం – 53వ భాగం

ఆధునిక జీవనశైలిలో ఏర్పడే శారీరక సమస్యలకు ‘వ్యాయామం’ చాలా ప్రభావవంతమైన పరిష్కారం. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్న వ్యాయామ తత్వం నేటికీ సమానంగా ఉపయోగకరంగా ఉంది. వాటి నుంచి మనం ప్రేరణ పొందవచ్చు. ఈ వ్యాసమాలలో మేము “వ్యాయామం యొక్క ప్రాముఖ్యత, వ్యాయామ సంబంధిత సందేహాల నివృత్తి, ఎర్గోనామిక్స్ (Ergonomics) తత్వం మరియు ఆరోగ్య సమస్యకి అనుగుణంగా చేయవలసిన సరైన వ్యాయామం” గురించి వివరించబోతున్నాం. ఈ వ్యాసాలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడంలో ప్రేరణగా నిలుస్తాయి. ఈ వ్యాసంలో మనం వేసవి కాలంలో కూడా వ్యాయామం చేయడం ఎందుకు అవసరం అనే విషయాన్ని తెలుసుకుందాం.

ప్రతిరోజూ వ్యాయామం

1. చరక సంహిత, సుశ్రుత సంహితల ప్రకారం నిత్యంగా వ్యాయామం చేయాలి

వేసవి ముదురుతోంది. వేసవిలో వ్యాయామం అవసరం లేదు అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ అది సరైనది కాదు. వ్యాయామం అనేది సంవత్సరం పొడవునా నిరంతరం చేయాల్సిన విషయమే. చరక సంహిత, సుశ్రుత సంహిత వంటి ఆయుర్వేద గ్రంథాలలో రోజూ చేయవలసిన కార్యకలాపాలలో ముఖం కడుక్కోవడం, స్నానం, భోజనం వంటివాటితో పాటు వ్యాయామం కూడా ఉండాలని చెప్పబడింది. ఋతువులకు అనుగుణంగా వ్యాయామం మోతాదు మరియు రకాన్ని మార్చుకోవచ్చని సూచించబడినా, వ్యాయామం మాత్రం నిత్యం చేయాలనే చెప్పబడింది.

2. ఎండాకాలం అయినా అన్నం తినడం ఎలాగైతే మానమో, అదే విధంగా వ్యాయామం కూడా మానకుండా చేయాలి.

చలికాలంలో శరీర ఉష్ణోగ్రత నిలబెట్టుకోవడానికి ఎక్కువ పోషకాహారం తీసుకోవాలి, ముఖ్యంగా నెయ్యి, వెన్న, నూనె వంటి పదార్థాలు ఎక్కువగా అవసరం అవుతాయి. ఆలా పోల్చి చూస్తే, వేసవిలో ఆహారం తక్కువగా తీసుకోవాలి, అలా అని మనం ఆహారాన్ని పూర్తిగా మానం కదా? అలాగే వ్యాయామాన్ని కూడా మానకూడదు.

3. శరీర అవయవాల క్రమబద్ధమైన పనితీరుకు వ్యాయామం తప్పనిసరి

చలికాలంతో పోలిస్తే వేసవిలో వ్యాయామాన్ని కొద్దిగా తగ్గించవచ్చు. కానీ పూర్తిగా మానేయడం సరికాదు. వేసవిలో మనం చల్లటి నీటితో స్నానం చేస్తాం, చలికాలంలో వేడి నీటితో, కానీ స్నానం చేయడం మానం కదా? అలాగే వ్యాయామం కూడా. రైతు ఎలాంటి ఋతువు వచ్చినా వ్యవసాయం చేయాల్సి ఉంటుంది, అందువల్లే అతడు ఆరోగ్యంగా ఉంటాడు. అతను వేసవిలో పని చేసినా జ్వరాలు రావు, వర్షంలో తడిసినా జలుబు రాదు. అంటే వేసవిలో వ్యాయామం చేయడం వల్ల ఏమీ నష్టం ఉండకపోగా మరింత ఆరోగ్యం పొందుతారు. మన శరీరంలోని వివిధ ఇంద్రియాల క్రియ బాగా జరగడానికి నిత్యం వ్యాయామం చేయడం తప్పనిసరి.

4. వ్యాయామం మనిషిలో సహజ అలవాటుగా ఉండాలి

వేసవిలో వ్యాయామం చేస్తే ఎండా ఎక్కువగా అనిపించదని అనుభవం చెబుతోంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలి. మన శరీరం సహజంగా శ్రమించడానికి సిద్ధంగా ఉండాలి. కానీ నేడు మనం అనేక విషయాలను కృత్రిమంగా మార్చుకుని శక్తిని తగ్గించుకుంటున్నాం. అందుకే “వ్యాయామం చేయండి, వేసవిలోనూ చేయండి” అని పునరుద్ఘాటించాల్సి వస్తోంది. వేసవిలో ఉదయం లేదా సాయంత్రం చల్లని సమయంలో తప్పకుండా వ్యాయామాన్ని కొనసాగించాలి.

(సౌజన్యము : శం. ధోం. విద్యావాంస్, సంపాదకుడు, మాసపత్రిక ‘వ్యాయామ’, 15.4.1952)

Leave a Comment