శ్రీ గణపతికి తులసి దళములను ఎందుకు సమర్పించకూడదు ?

పౌరాణిక కారణము

పురాణముల ప్రకారము, పూర్వము ఒక అందమైన గంధర్వ కాంత ఉండేది. ఆమె తనకొక మంచి భర్త కావలెనని కోరుకొన్నది. అందుకోసం ఆమె ధ్యానం చెయ్యడం, వ్రతములను ఆచరించడం, తీర్థ యాత్రలు చెయ్యడం వంటి అనేక పుణ్య కార్యములను చేసింది. ఒకరోజు ఆమె శ్రీ గణపతి ధ్యానంలో ఉండడాన్ని గమనించింది. వెంటనే అతని పట్ల ఆకర్షితురాలైంది. అతడిని ధ్యానం నుండి మేల్కొల్పడానికి ఆమె “ఓ ఏకదంతా, ఓ లంబోదరా, ఓ వక్రతుండా” అని పిలువ సాగింది. దీని వలన ధ్యానమునకు ఆటంకము కలిగిన శ్రీ గణపతి కనులను తెరిచెను. ఎదురుగా గంధర్వ కాంతను చూసిన ఆయన “ఓ మాతా, నా ధ్యానమునకు నీవు ఎందుకు ఆటంకం కల్పిస్తున్నావు? ” అని ప్రశ్నించెను. దానికి ఆమె “నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను” అని బదులు పలికెను. దానికి శ్రీ గణపతి “నేను ఎన్నడూ పెళ్లి చేసుకుని  బంధం అనే ఉచ్చులో చిక్కుకొనను” అని చెప్పగా, ఆ గాయకురాలు “మీరు తప్పక వివాహమాడతారు” అని శపించెను. దానికి శ్రీ గణపతి “నువ్వు భూమి మీద ఓ చెట్టుగా జన్మిస్తావు” అని ప్రతి శాపం ఇచ్చెను. ఆమె తన ప్రవర్తనకు పశ్చాత్తాప పడి క్షమించమని వేడుకొనెను. అప్పుడు శ్రీ గణపతి “ఓ మాతా! నిన్ను శ్రీ కృష్ణుడు వివాహం చేసుకుంటాడు, నీవు సంతోషంగా ఉంటావు” అని పలికెను. ఆ తరువాత ఆమె భూమి పై తులసి మొక్కగా పుట్టెను. శ్రీ గణపతి తులసి మొక్కను ఎప్పుడూ ఆదరించలేదు. కాబట్టి, తులసి దళములను ఆయనకు ఎన్నడూ సమర్పించరు.

ఇతర కారణములు

శ్రీ గణపతి ముఖ్యముగా కామితార్థముల కొరకు ఆరాధించబడతారు. కానీ తులసి మొక్క నిర్లిప్తతను సూచిస్తుంది కాబట్టి తులసి దళాలను గణపతికి సమర్పించడం నిషేధింపబడింది.

Leave a Comment